Produced by volunteers at Pustakam.net
అవంతీ ప్రచురణలు 4.
ఓనమాలు
రచన:
మహీధర రామమోహనరావు
సోల్ డిస్ట్రిబ్యూటర్లు:
విశాలాంధ్ర ప్రచురణాలయం,
విజయవాడ-2
మొదటి ముద్రణ
1956
వెల
రెండు రూపాయల పావలా
అవంతీ ప్రెస్
రాజమండ్రి
1947….
….నాటి తెలంగాణా ఒక అగ్నిగుండం.
దుస్సహమైన జాగీర్దారీ వ్యవస్థను నిర్మూలించగల పోరాటాల్ని ప్రజానీకం సాగిస్తూంది. వాటినన్నింటినీ ఒకే జెండా క్రిందికి తెచ్చి,రాజకీయ నాయకత్వం సమకూర్చడానికై ఆంధ్రమహాసభా, కమ్యూనిస్టు పార్టీ సన్నాహాలు సాగిస్తున్నాయి.
రెండో వైపున – విదేశీ పాలనకూ, సంస్థానాధీశుల నిరంకుశ పాలనకూ వ్యతిరేకంగా జాతీయ ప్రజాతంత్ర పోరాటాలు తెలంగాణాన్నిఅలుముకొంటున్నాయి.
ప్రజాతంత్ర హక్కులకై సాగుతున్న ఈ పోరాటాలు ఐక్యతను కూర్చుకొంటూ నిజాము పరిపాలనా యంత్రాన్ని మొదలంట కదిల్చివేస్తున్నాయి.
ఈ దశలో …
విచ్ఛిన్నమైపోతున్న జాగీర్దారీ వ్యవస్థను రక్షించగల శక్తి నిజాము ప్రభుత్వానికి లేదని గ్రహించిన భూస్వామ్యవర్గం నూతననాయకత్వం కొరకై వెతుకులాడుతూ జాతీయోద్యమంలో తనకు రక్షణనివ్వగల శక్తుల్ని చూసుకొంది.
సమాజంలో తనకున్న బలం క్రమంగా క్షీణించి పోతూంటే, కూలిపోతున్న తన అధికారాన్ని పరిరక్షించుకొనేటందుకై మతవాదుల్నీ, రౌడీల్నిసమీకరించి విధ్వంసకాండకు పూనుకొంది నిజాము సర్కారు.
ప్రజానీకానికీ, ప్రతిరోధ శక్తులకూ మధ్య జరిగిన ఈ ఘర్షణలలో తెలంగాణా ఒక అగ్నిగుండమే అయింది.
ఆనాటి సంఘర్షణలే నా ఈ నవలకు కథావస్తువు. సుదీర్ఘమైన ఈ నవలలో మొదటి భాగం పాఠకుల ముందుంచుతున్నా. త్వరలోనేమిగతావీ.
విజయవాడ,
20-3-56
రచయిత.
భూమి కోసంభుక్తి కోసంనిగళబంధవిముక్తి కోసంనేల కొరిగినతెలుగు జోదులకిత్తు నంజలులు.
కృతజ్ఞత
తమ పత్రికలో ధారావాహికగా వెలువడిన ఈ నవలను పుస్తకరూపంలో ప్రచురించుకొనుటకనుమతించిన విశాలాంధ్ర సంపాదకులకు -
రచయిత.
ఓనమాలు(మొదటి భాగం)
ఒకటో ప్రకరణం.
నెత్తిన తన్నుతూన్న కాకుల్నీ, గోరింకల్నీ తప్పించుకుంటూ చక్కర్లు కొడుతున్న ఓ గద్ద దీర్ఘప్లుతంలో కృష్ణ నామస్మరణచేస్తూంది.
ఏప్రిల్ నెల. ప్రొద్దుట ఎనిమిదింటికే ఎండ భగ్గుమంటూంది. ఎర్రగా కనిపిస్తున్న నేల వేగి పోయినట్లు పొగలు చిమ్ముతూంది.
కనుచూపు మేరలో పచ్చదనమే కనబడని పర్రభూమి. అక్కడా అక్కడా చాపంతమేరా, చదరంతమేరా పండి, ఎండి గోధుమరంగులీనుతున్న అవిరిగడ్డి మాసికలు; ఆ అవిరిగడ్డి కూడా లేక బొగులు బొగులుమంటున్న చిన్న చిన్న గుట్టలూ, పెద్ద పెద్దబండలూను.
మండుతున్న ఆ మైదానంలో కంటికి చల్లగా కనబడుతున్నదొక్క బోళ్ళ పొలమే.
గట్టు. దాని వంచన రాయి పగలకొట్టి కట్టిన మోటబావి. గుండ్రంగానో, పలకలుగానో, అంచులు తీర్చి కొట్టిందీ కాదు. కట్టిందీకాదు. పనసపండు మీది పగులులాగ రసం చిప్పిలుతూన్న ఒక పెద్ద బీట అది. పొడుగ్గా బద్దలయిన బండలలో ఒక మూల మోటకోసం రాతితో తీర్చి కట్టిన అంచు కట్టూ, ఆ రాతి కట్టులో నీటికి కొంచెం పైగా పెద్ద పెద్ద గూళ్ళలా కట్టిన గుళ్ళూ చూస్తేతప్ప అదొక నుయ్యి అనిపించదు. పొడుగ్గా బద్దలయిన బండ మధ్య, కొమ్మ నాచు క్రింద నల్లగా కనిపిస్తున్న చల్లనినీళ్ళూ, నీళ్ళలోంచీ ఎగుడు దిగుడుగా గొగ్గిపళ్ళల్లా వున్న అంచులూ. ఆ ఎగుడు దిగుడుల్లోనూ, రాతి నెరియల్లోనూ వేళ్ళూనుకొనిపెరుగుతున్న జువ్వి మొక్కా, వేపచెట్టూ, వాని మధ్య నుంచి నూతిలోకి దిగేటందుకు మెట్లుగా కొట్టిన రాళ్ళూ. రాళ్ళ క్రిందకొమ్మనాచు అలుముకొని, నల్లగా, చల్లగా కనిపించే నీరు బొగులు బొగులుమంటున్న ఆ పర్రలో ఇంత చల్లని మేరని సృష్టించింది.
మ